Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 23, 2013

యాకోబు3వఅధ్యాయము

1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.
2. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.
3. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా.
4. ఓడలనుకూడ చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.
5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!
6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.
7. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని
8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
9.దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
10. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.
11. నీటిబుగ్గలో ఒక్క జల నుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?
12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్ళలోనుండి తియ్యని నీళ్ళును ఊరవు.
13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది.
16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
17. అయితే పై నుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునైయున్నది.
18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
          Download Audio File

No comments:

Post a Comment